అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అక్కడ ఆయన అభిమానుల్ని పలకరిస్తూ ఓపెన్ టాప్ జీపులో కూడా ప్రయాణించారు. కుంటాల జలపాతం వద్ద పార్కులో ఆయన మొక్కలు కూడా నాటారు.