‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పక్కన పెట్టి.. మహేష్‌ మూవీ కోసం రాజమౌళి చర్చలు

యంగ్‌ టైగర్‌ ఎన్‌టిఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఎట్టి పరిస్థితులలోనైనా ఆర్‌ఆర్‌ఆర్‌ త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి గట్టి పట్టుదలతో ఉన్నారు. కానీ కరోనా ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. అనుమతుల అనంతరం అన్నీ ఏర్పాటు చేసుకున్నా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా వేచి చూడక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం, ఇప్పటికే షూటింగుల్లో పాల్గొన్న బుల్లితెర నటులు కొందరికి కరోనా పాజిటివ్‌ రావడం వంటి కారణాలతో బడా హీరోలు షూటింగ్‌కు ససేమిరా అంటున్నారు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ మొదలు పెట్టడానికి జక్కన్న మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అయితే రాజమౌళి తన సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్‌ తీసుకుంటాడనేది అందరికి తెలిసిన విషయమే.. అయితే ఈసారి జక్కన్న ఆలోచనలో మార్పు వచ్చినట్టుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ప్రారంభమయ్యేలోపు ఉన్న గ్యాప్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ మూవీ పనులు చూసుకుందాం అని అనుకున్నారట! దీని కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కథా చర్చలు కూడా మొదలెట్టారు. మహేష్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా రాజమౌళి కథ తయారు చేస్తున్నాడట! మరోపక్క మహేష్‌ ఫ్యాన్స్‌ కూడా తమ హీరో కోసం జక్కన్న ఎటువంటి కథ సిద్ధం చేస్తాడో అని అనుకుంటున్నారు.