ఇంట్లోనూ మాస్క్‌ను ధరించాల్సిందే..

నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వికె.పాల్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో.. అనవసరంగా ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లవద్దని అన్నారు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే మిగతా వాళ్లంతా ఇంట్లోనూ మాస్కులు ధరించాలని సూచించారు. వాస్తవానికి అందరూ ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకుంటే మంచిదని వికె.పాల్‌ సలహా ఇచ్చారు. కరోనా సోకిన వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలని కోరారు. ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఒకచోట కూర్చున్నప్పుడు మాస్కులు పెట్టుకుంటే మంచిదని అన్నారు. కరోనా సోకిన వ్యక్తి ప్రత్యేకంగా మరో గదిలో ఉండాలని (హోం ఐసోలేషన్‌) చెప్పారు. ఏమాత్రం కోవిడ్‌ లక్షణాలు ఉన్నా.. రిపోర్ట్‌ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలంటూ వికె.పాల్‌ సలహా ఇచ్చారు. ఆర్టీ-పిసిఆర్‌ నెగటివ్‌ వచ్చినా.. అప్పటికే లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి అందరికీ దూరంగా ఉంటే మంచిదని వికె.పాల్‌ వివరించారు.