ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం నిలిపివేత

కోవిడ్‌-19(కరోనా వైరస్‌) విజృంభిస్తున్నందున నేడు సాయంత్రం నుంచి బెజవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు ప్రకటించారు. అయితే అమ్మవారికి ప్రతిరోజూ పూజాకార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేటి నుంచి ఘాట్‌లో వాహనాలు నిలిపివేస్తున్నామని వెల్లడించారు. తిరిగి అమ్మవారి దర్శనం ఎప్పుడు ఉంటుందనేది తర్వాత చెప్తామని తెలిపారు.
అప్పటివరకు భక్తులు గుడికి రావద్దని విఙ్ఞప్తి చేశారు. వీఐపీ దర్శనాలను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సిబ్బంది ఎప్పటిలాగే తమ విధులు నిర్వహిస్తారని పైలా సోమినాయుడు పేర్కొన్నారు.