రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా బలమైన కేంద్రం ఉండాలనే ఆర్‌ఎస్‌ఎస్ అజెండాకు అనుగుణంగానే మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉంది. బోర్డుల పరిధి, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతులు వంటి విషయాల్లో తుది నిర్ణయం తమదేనని చెప్పడం రాష్ట్రాల హక్కులను హరించడమే. ట్రిబ్యునల్ కేటాయిపుల ఆధారంగా రాష్ట్రాలు ప్రాజెక్టులను చేపట్టడం సర్వసాధారణం.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవహారం. ప్రాజెక్టుల నిర్వహణ కూడా రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకు రావాల్సిన కేటాయింపులపై తమ వాదనలు గట్టిగానే వినిపించినప్పటికీ… నిర్ణయాత్మక అధికారం తమదేనన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అంతగా ప్రతిఘటించినట్టు లేదు. ఇప్పటికే పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అన్ని అనుమతులూ కేంద్రం నుండే రావాలంటే.. ప్రాజెక్టుల నిర్మాణం ఇక అంత సులభం కాదని పలువురు సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
