అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్‌పి చెబుతోందని అన్నారు. ఫేక్ సమాజ్‌వాద్.. పేదల ప్రభుత్వం మధ్య ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్ కాలేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలు గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఈ రోజుల్లో.. ప్రజలు చాలా కలలుగంటున్నారు. నిద్రపోయే వారికే ఆ అవకాశం’ అని వ్యాఖ్యానించారు. దీన్ని అఖిలేష్ యాదవ్‌కు ముడిపెడుతూ.. ఎద్దేవా చేశారు. యుపిలో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రతి రోజు కలలోకి వచ్చిన శ్రీకృష్ణుడు చెప్పాడంటూ అఖిలేష్ యాదవ్ అంటున్నారని వ్యాఖ్యానించారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పట్టణ ప్రాంతాల్లోని గృహాల సమస్యలపై మాట్లాడుతూ.. అవినీతి కారణంగానే అక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన వేలాది మంది సమస్యల్లో కూరుకున్నారని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్లాట్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
