కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు ఏకంగా 36,047 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 21వ తేదీన 24,451 పరీక్షలు నిర్వహించగా.. ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాకు 14,049 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మొదటి స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటల్లో 497 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 10,331కి చేరాయి. ఇందులో 1,660 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి కాగా, 365 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబందించినవి.