కరోనాతో నిమ్స్‌ విలవిల

సిరల్లోకి.. ధమనుల్లోకి వారు సెలైన్లు, యాంటీ బయాటిక్స్‌ కాదు.. జీవధాతువులను ఎక్కిస్తారు. కన్న పేగు బంధాలను ఇంటి దర్వాజ లోపల కట్టేసి.. లోకాన్ని కాటేస్తున్న కరోనాపై కత్తి దూస్తున్నారు. మంచాల్లో మూలుగుతున్న ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెడుతున్నారు. యముని మహిషపు లోహ ఘంటారావాలను దూది పింజలతో అడ్డుకుం టున్నారు. ఈసడింపులను సైతం విస్మరించి రోగులకు ప్రేమగా ‘జీవగోలీ’లను అందిస్తారు. ధవళ వస్త్రాల్లో కాంతులీనే ఆ ‘నర్సక్కలు’ విధి నిర్వహణలో ఎదుర్కొనే విపత్తులు జగానికి కానరావు. ద్వేషాన్ని మింగుతూ సేవలను పంచే నర్సులను.. ‘కరోనా’ కాలంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన పై అధికారులు వారిని ‘బలివితర్దులు’గా మారుస్తున్న అత్యంత విషాద, హేయ ఘటనలు సాక్షాత్తూ రాష్ట్ర రాజధానిలో నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. సంబంధిత ఉదంతాలపై పకడ్బందీ సాక్ష్యాలను సేకరించి అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఒక వ్యక్తి ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చాడనుకుందాం. రైల్వేస్టేషన్‌లో ఉన్న వైద్యేతర అధికారులు ఆయన చేతికి ‘క్వారంటైన్‌’ ముద్ర వేస్తారు. ఆ వ్యక్తి తప్పనిసరిగా ఇంట్లోనే 14 రోజులు గడపాలి. మధ్యలో రోడ్డు మీద కన్పిస్తే పౌరులు పోలీసులకు ఫోన్‌ చేయవచ్చు. అప్పుడేం జరుగుతుంది? సదరు వ్యక్తిని బలవంతంగా ‘గాంధీ’కి తరలిస్తారు. 14 రోజులు క్వారంటైన్‌ చేస్తారు. ఇక్కడ గమనార్హమైన విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తి దూర ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అతనికి కరోనా ఉండవచ్చునన్న అనుమానం. లేదా కరోనా సోకిన వారితో కలివిడిగా ఉండి ఉండవ చ్చునన్న సంశయంతోనే ‘స్టాంప్‌’ వేస్తున్నారు.