కరోనా ఎఫెక్ట్ :మోదీ బంగ్లా పర్యటన రద్దు ?

మూడు కరోనా కేసులు నమోదయ్యాయని బంగ్లాదేశ్‌ ప్రకటించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఢాకా పర్యటనను రద్దు చేసుకోవచ్చని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌ వ్యవస్ధాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 17న ప్రధాని మోదీ ఢాకా పర్యటన ఖరారైంది.కాగా ఇటలీ నుంచి ఢాకాకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. వీరి బంధువైన మరొకరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. బంగ్లాదేశ్‌లోనూ కరోనా వ్యాప్తితో ప్రధాని మోదీ పర్యటన రద్దయ్యే అవకాశం ఉండటంతో ప్రధాని రద్దు చేసుకున్న రెండో విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఇండో-ఈయూ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రసెల్స్‌ పర్యటన సైతం కరోనా భయాలతో రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ బంగ్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.