కరోనా కాటుకు కుల, మత బేధాల్లేవు
కరోనా కాటుకు కుల, మత బేధాల్లేవు

కరోనా కాటుకు కుల, మత బేధాల్లేవు: సీఎం జగన్‌

ఢిల్లీలోని మర్కజ్‌ సమావేశానికి వెళ్లిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్‌ సోకడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా కాటుకు కుల, మత, ప్రాంత బేధాలు లేవని, అందరు కలిసి ఐక్యంగా యుద్దం చేస్తేనే ఈ మహమ్మారిని తరిమేయడం సాధ్యమవుతుందన్నారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం జగన్‌ శనివారం రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనాపై పోరాటం చేయాలని కోరారు.

‘ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొందరు విదేశీ ప్రతినిధులకు కరోనా వైరస్‌ఉండటంతో మన దేశంలోని ప్రతినిధులకు కరోనా వైరస్‌ సోకింది. మన దేశంలో కూడా అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో అయినా ఇలాంటివి జరగొచ్చు. జరిగిన సంఘటనను దురదృష్టకరంగా చూడాలి తప్ప ఏ ఒక్కరికి ఆపాదించవద్దు. అందరూ కలిసి ఐక్యంగా యుద్దం చేయాలి. కరోనా బాధితులను తప్పు చేపినట్లుగా భావించవద్దు . మనమంతా వారి పట్ల ఆపాయ్యతను చూపాలి’ అని సీఎం జగన్‌ అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం నాడు ప్రతి ఒక్కరు దీపాలు, క్యాండిల్స్‌, టార్చిలైట్‌, సెల్‌ఫోన్‌లైట్‌ వెలిగించాలని కోరారు. మనం ఇచ్చే ఈ సంకేతం గొప్ప ఆదర్శంగా ఉంటుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.