కరోనా నాల్గవ దశ మరింత ప్రమాదకరం

 ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 40 లక్షల మార్కును దాటడంతో.. కరోనా మహమ్మారి నాల్గవ దశ (తీవ్ర ఉధృతి) లోకి ప్రవేశించిందని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. యూరోపియన్‌ దేశాల్లో రెండో దశలో, అమెరికాలో మూడవ దశలో ఉండగా, భారత్‌, దక్షిణ అమెరికాలు మొదటి దశ ముగింపులో ఉన్నాయని అన్నారు.2019 డిసెంబర్‌, 2020 ప్రారంభంలో చైనాలో కరోనా మహమ్మారి మొదటి దశ ప్రారంభమైంది. అయితే ఫిబ్రవరి చివరి నాటికి చైనా కరోనా వ్యాప్తిని నివారించగలిగింది. దీంతో మొదటిదశ ముగిసింది. యూరప్‌లో మార్చిలో రెండో దశ ప్రారంభమైందని, ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌, జర్మనీలు హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి. మే చివరి నాటికి అమెరికాలో ప్రారంభమైంది. ఇక్కడి నుండి మూడవ దశ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. రోజువారీ కేసులు కూడా అధిక సంఖ్యలో నమోదయ్యాయి. అదేవిధంగా ఆగస్టు నాటికి భారత్‌లో వైరస్‌ విజృంభణ ప్రారంభమైంది.వరల్డ్‌ఒమెటర్స్‌.ఇన్ఫో ప్రకారం.. గతవారంలో అమెరికాలో సగటున 55,917 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఆగస్టు మొదట్లో  కరోనా కేసుల ఉధృతి తగ్గుతున్న తరుణంలో, మరోసారి అత్యదిక కేసులు నమోదవడంతో రెండోదశ ప్రారంభమైనట్లుగా పేర్కొన్నారు. ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో కొత్త కేసులుపెరిగాయి. మూడోదశలో రెండో దశను అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.