కరోనా నుండి కోలుకున్న అమితాబ్‌, ఇంకా ఆసుపత్రిలోనే అభిషేక్‌

బిగ్‌ బి కరోనాను జయించారు. జులై 11వ తేదీన కరోనా పాజిటివ్‌ అని తేలడంతో మంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌ 21 రోజుల వైద్యం తర్వాత కోలుకున్నారు. కరోనా పరీక్షలో నెగిటివ్‌ అని తేలడంతో 77 ఏళ్ల అమితాబ్‌ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా అమితాబ్‌తోపాటే కరోనా పాజిటివ్‌ కారణంగా నానావతి ఆసుపత్రిలో చేరిన ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఆయనకు చేసిన పరీక్షలో మళ్లీ పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో అభిషేక్‌ ఆసుప్రతిలోనే ఉండిపోయాడు. అయితే ఆరోగ్యం మాత్రం స్థిరంగా ఉందని చెప్పాడు. కాగా జులై 12వ తేదీన ఐశ్వర్యారారు, ఆరాధ్య కూడా కోరనా పాజిటివ్‌గా తేలడంతో వారు స్వీయ గృహ నిర్భందంలోకి వెళ్లారు. ఆ తర్వాత నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. వారం రోజుల్లోనే వారు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌కి మాత్రం కరోనా సోకలేదు.