కరోనా నేపథ్యంలో జనగణన వాయిదా-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

కరోనా నివారణకు కేంద్రం అన్నిచర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ అన్నిరాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల్లో పర్యవేక్షణ కోసం జాయింట్ సెక్రటరీలను నియమించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టుమైన నిఘా పెట్టామని తెలిపారు. మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు. కరోనా నేపథ్యంలో జనగణన ను వాయిదా వేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.