కరోనా బారినపడిన మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్ (54) కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే ఆయనను థానేలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మంత్రి తన 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ అనే వచ్చింది. అయితే, లాక్‌డౌన్‌పై ముంబ్రా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారితో నిర్వహించిన సమావేశం అనంతరం మంత్రికి కరోనా సోకివుండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ పోలీసు అధికారికి ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబ్రాలోని తబ్లిగీ జమాత్ సభ్యుల కోసం నిర్వహించిన ఆపరేషన్‌లో ఆ పోలీస్ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 మంది బంగ్లాదేశీయులు, 8 మంది మలేషియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగానే ఆయనకు కరోనా సోకి ఉంటుందని, ఆయనతో మీటింగ్ సందర్భంగా మంత్రికి అది సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.