కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాం : జిల్లా కలెక్టర్‌

గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు. బుధవారం వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ… ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని, ఆ తర్వాత నుండి కర్ఫ్యూ అమలులో ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ శానిటేషన్‌ చేసుకుంటూ, భౌతిక దూరాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు.
   రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడుతూ… ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే ప్రయాణాలు చేయాలని, తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌ కి వచ్చే అత్యవసర వాహనాలను ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తామని చెప్పారు. డిజిపి ఆదేశాల మేరకు మరింతగా మాస్క్‌ డ్రైవ్‌ చేపడతామని స్పష్టం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించి కోవిడ్‌ నియంత్రణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజల సేవ కోసమే 24 గంటలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. అత్యవసర సమయాల్లో గుర్తింపు కార్డులు చూపించాలని అన్నారు.