కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ, ఏపీ వాడివేడి వాదనలు..

సాగు నీటి వాటాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్న వేళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. హైదరాబాద్‌లోని జలసౌధలో గురువారం మధ్యాహ్నం మొదలైన సమావేశం సాయంత్రం ఆరుగంటల వరకూ సాగింది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తమ వాదనలను బోర్డు సభ్యులకు వినిపించారు. అనంతరం తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు.

ఏపీలో పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్నందున ఆ మేరకు తెలంగాణకు అదనపు జలాలు ఇవ్వాలని బోర్డును కోరినట్లుగా రజత్ కుమార్ వెల్లడించారు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను బోర్డుకు చెప్పామని వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించవద్దని తెలంగాణ తరపున రజత్‌కుమార్ వాదనలు వినిపించారు. కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. వాటినే తాము ఇప్పుడు కొనసాగిస్తున్నామని వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.