గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎస్పీ బాలు శుక్రవారం మరణించారని తెలిపారు డాక్టర్లు. కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్సపొందిన ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంది. అయితే తాజాగా మరోసారి అస్వస్థతకు గురైన బాలసుబ్రహ్మణ్యం చివరికి ప్రాణాలు కోల్పోయారు. బాలసుబ్రహ్మణ్యం మరణవార్తను టాలీవుడ్ తో పాలు అన్ని సినీ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.

1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎంతమంది హీరోలకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్పీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. సినిమా పాటలే కాకుండా పలు టీవీ షోల్లో పాటలు పాడి ఆకట్టుకున్న ఎస్పీ.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్ లాంటి అరుదైన సత్కారాలను అందుకున్న గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం.