గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఏపీకి తరలించడంలో సహకరించినందుకు విజయ్ రూపానీకి, అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. గుజరాత్ చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి సీఎం వైఎస్ జగన్ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ సీఎంకు ఫోన్ చేయడమే కాకుండా.. పలుమార్లు వారి పరిస్థితి గురించి సమీక్ష చేపట్టారు. అలాగే మత్య్సకారుల బాగోగులు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని క్షేమంగా ఏపీకి తరలించేందుకు రూ. 3 కోట్లు మంజూరు చేశారు.తాజాగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ జరిపిన చర్యలు ఫలించాయి. గుజరాత్ నుంచి 12 బస్సుల్లో ఏపీకి బయలుదేరిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఉదయభాను మత్య్సకారులకు జగ్గయ్యపేట వద్ద కిచిడీ ప్యాకెట్లు పంపిణి చేశారు. కాగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదు చోట్ల అల్పాహార పాకెట్లు, వాటర్ బాటిళ్లను సిద్ధం చేసినట్లు మత్య్సశాఖ పేర్కొంది.

గుజరాత్ సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్