చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

ఎపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలు నేటికి ఏడాది కావడంతో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాయపూడి సభకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయుని పాలెం వెళ్లేందుకు కాన్వాయ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో టిడిపి నాయకులు, రైతులు ఆందోళనకు దిగడంతో చివరకు రెండు వాహనాలకు అనుమతి ఇచ్చారు. కాన్వాయ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు దించి వేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి నక్క ఆనందబాబు, కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సిఎం అని కూడా చూడకుండా పోలీసులు అవమానించారని మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, టిడిపి నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. వెలగపూడి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రాయపూడి వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. ముళ్లతీగలతో రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు.