చంద్రబాబు పై అంబటి ఫైర్
చంద్రబాబు పై అంబటి ఫైర్

చంద్రబాబు పై అంబటి ఫైర్

ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చంద్రబాబును విశాఖవాసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపణలకు దిగారు. వీటిపై స్పందించిన అంబటి గురువారం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారని వివరించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని.. వారు వ్యవహరించిన తీరు సరైనదేనని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులుగా అంబటి అభివర్ణించారు. అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా లక్క్ష్యం అని అంబటి స్పష్టం చేశారు. ‘చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నేడు ప్రజాగ్రహాన్ని చవిచూశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి.. బాబు కుళ్లుబుద్ధికి మధ్య పోరాటం జరుగుతోంది. వైజాగ్ వెళ్లి అమరావతి జిందాబాద్ అంటూ రెచ్చ గొడుతున్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దని చెపితే చంద్రబాబును మేళా తాలతో స్వాగతిస్తారా..? ఉత్తరాంధ్ర నాశనం చేస్తానంటే అక్కడ ప్రజలు స్వాగతిస్తారా..? చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపేశారు. అమరావతి రాజుగారు ఉత్తరాంధ్ర మీద దండయాత్రకు వెళ్లి నట్లు చంద్రబాబు వెళ్లారు. గతంలో హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలికి వెళ్తే ఎయిర్ పోర్ట్ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బయటకు రానివ్వలేదు. వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు వస్తే రన్‌వే మీద అడ్డుకున్న విషయాన్ని మర్చిపోవద్దు
రాష్ట్రంలో ఏం జరిగినా పులివెందుల నుంచి వచ్చారని టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కాపుల ఉద్యమ సమయంలో కూడా పులివెందుల నుంచి రౌడీలు వచ్చార’ని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.