పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాలపై సోమవారం ఉభయ సభలు దద్దరిల్లాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సోమవారం శాసనసభలోనూ, శాసనమండలిలోనూ ఈ విషయంపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుపట్టారు. రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురికావడంతో టిడిపి సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో శాసనసభలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. సారా తాగినందువల్లే మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించిన టిడిపి సభ్యులు దీనికి బాధ్యత వహించి సిఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి, పోడియం వద్దకు, ఆక్కడి నుండి దాదాపుగా స్పీకర్ కుర్చీ వద్దకు దూసుకుపోయారు. చేతిలోని కాగితాలను, ప్లకార్డులను ముక్కలు చేసి స్పీకర్ తమ్మినేని సీతారాం పై వేశారు.
