రాష్ట్ర మంత్రివర్గంలో పని చేస్తున్న పిల్లి సుభాస్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎంపికవ్వడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని సిఎం జగన్‌మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈనెలాఖరులోగా కొత్త మంత్రుల ఎంపిక ఉంటుందంటూ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాగా రాజ్యసభకు ఎంపికయిన పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ బిసిలే. వీరి స్థానంలోనూ బిసిలనే తిరిగి మంత్రులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లూ టిడిపికి ఓటు బ్యాంక్‌గా ఉన్న బిసిలను ఆకర్షించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే బీసీలకు కీలక పదవులను కట్టబెట్టారు. బిసిలకు సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టి నేరుగా నగదు అందజేస్తున్నారు. రాజ్యసభకు ఇద్దరు బిసిలను పంపించి తమగల చిత్తశుద్దిని బిసిలకు చూపించారు. ఇప్పుడు ఈ రెండు మంత్రిపదవులను కూడా బిసిలకే కేటాయించి ఆ వర్గాల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.
