జనసేనతో బిజెపికి ఎలాంటి పొత్తు ఉండదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేనతో బిజెపికి ఎలాంటి పొత్తు ఉండదని బిజెపి తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి వల్లే వరదసాయం ఆగిందని చెబుతున్న కేసీఆర్‌ దమ్ముంటే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని సవాల్‌ విసిరారు. వరదసాయంపై బిజెపిపై టిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని, తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై కెసిఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల్లో గెలిచాక వరద బాధితులందరినీ పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు.