టీడీపీ జూమ్ పార్టీ లా మారింది -బొత్స సత్యనారాయణ

గ్యాస్‌ లీక్‌ బాధిత గ్రామాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని శాఖలు సత్వరం స్పందించడంతో నష్టం తగ్గిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో బాధితులందరికి పరిహారం కూడా అందించామని చెప్పారు. ఆస్పత్రుల్లో బాధితులందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెండు రోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి ఉందన్నారు. ఎరవరికీ సమస్యలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా పరిహారం అందిస్తామన్నారు.ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. టీడీపీ ఇప్పుడు జూమ్‌ పార్టీలా మారిందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్‌ ద్వారా మెసేజ్‌లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.