టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో కొనసాగుతున్న ఉత్కంఠ

లాక్‌‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలపగా, సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్‌ అయితే రెగ్యులర్‌ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని రేపు చెబుతామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. దీంతో శనివారం కంటైన్మెంట్‌ జోన్లు, సప్లిమెంటరీపై పూర్తి వివరాలను తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మళ్లీ రేపటికి(శనివారం) వాయిదా వేసింది