డైరెక్షన్‌కు రెడీ అవుతున్న నిత్యామీనన్‌!

‘అలా మెదలైంది..’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నటి నిత్యామీనన్‌ ఆ సినిమాలో ఆమె మాటలతో తెలుగు కుర్రకారుని కట్టిపడేసింది. ఆ తరువాత నటించిన చాలా సినిమాలు ఆమెలోని నటనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికే నటిగానే కాకుండా కొన్ని సినిమాల్లో తనే స్వయంగా పాటలు పాడి గాయకురాలిగా కూడా నిత్యా ప్రూవ్‌ చేసుకుంది. ఇదిలా ఉండగా నిత్యా గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఆమెకు సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వం అంటే మహా ఇష్టమట!. అందుకే షూటింగులో తన సీన్స్‌ లేనప్పుడు కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును ఆమె పరిశీలిస్తూ ఉంటుంది. ఈ అభిరుచితోనే దర్శకురాలు కావాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా ఈ లాక్‌డౌన్‌ కాలంలో కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకుందట. ప్రస్తుతం వివిధ భాషల్లో తను కమిట్‌ అయిన చిత్రాలను వచ్చే ఏడాదిలోగా పూర్తిచేసేసి, 2022లో తప్పకుండా మెగా ఫోన్‌ పట్టుకోవాలన్నది నిత్యా కోరిక. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటోందట ఈ కేరళ కుట్టి.