దేశ రాజధానిలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తాత్కాలికంగా ఆరోగ్య శాఖ, ఇతర విభాగాల బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల అధిక జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అలాగే ఆప్ ఎమ్మెల్యే అతిషికి కూడా కరోనా సోకింది. కరోనా కట్టడిలో భాగంగా ఆమె వైద్యఆరోగ్య విభాగంతో కలిసి పనిచేస్తున్నారు. కాగా, అతిషితో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సలహాదారు అక్షరుమరాఠే, డిప్యూటీ సిఎం సలహదారు అనిండితా మాథుర్‌లకు కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. వారిని ముందుజాగ్రత్తగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు ఆదేశించారు. ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని శానిటైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే సత్యేందర్ జైన్‌తో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
