తక్షణ సాయంగా రూ.1350 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి కేసీఆర్ లేఖ

వర్షం వల్ల అతలాకుతలమైన తెలంగాణకు సాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తక్షణ సాయం కింద రూ.1350 కోట్లు సాయం అందించాలని సీఎం కోరారు. భారీ వర్షం, వరదల కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని కేసీఆర్ తన లేఖలో వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రూ.5000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రధానికి వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరారు.

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల అసోం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి తప్పనిసరిగా సాయం అందించాల్సిన పరిస్థితిని కల్పించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.