తమిళనాడును వణికిస్తున్న ‘నివర్‌’..

 ‘నివర్‌’ తుపాన్‌ తమిళనాడును వణికిస్తోంది. అతి తీవ్ర తుపాన్‌గా మారి తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ‘నివర్‌’ ప్రభావం ఉండటంతో ఎపిలోని తుపాన్‌ ప్రభావిత కొన్ని జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సముద్రంలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఉండటంతో తుపాన్‌ మరింత బలపడుతూ తీరంవైపుగా వస్తోంది. చెన్నైకి ఆగేయంగా 330 కిలోమీటర్ల దూరంలో నివర్‌ తుపాన్‌ కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రం కరైకల్‌, మామళ్లపురం మధ్య తీరాన్ని తాకుతుందని, తీరం దాటే సమయంలో తుపాన్‌ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ సమయంలో గాలుల ఉధృతి గంటకు 120-145 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో, ఆ తర్వాత 26, 27న తమిళనాడులోని కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.