తమిళనాడు అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టాలు రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాలను ఆమోదించిందని అన్నారు. వ్యవసాయాన్ని కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి ఈ చట్టాలను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ చట్టాలు వ్యవసాయ వృద్ధికి, రైతులకు సహాయపడవని అన్నారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారిగా తమ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, రైతుల జీవనోపాధిని పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా దేశంలో మార్కెట్లను నియంత్రించామని, అయితే కేంద్రం వాటిని రద్దు చేసే ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకువచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాలతో చర్చలు జరపలేదని, ఇది సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమని, అందుకే ఈ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తోందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రతిష్టను నాశనం చేస్తుందని అన్నారు. రైతుల శాంతియుత నిరసనను గౌరవిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని స్టాలిన్‌ అన్నారు.