దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మవారి దర్శనం

ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం దేవస్థానం తరఫున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఆషాఢ మాసం సారెను దేవస్థానం తరుఫున సమర్పించినట్లు తెలిపారు. ఇలా దేవస్థానం తరఫున సారె అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, వారికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం దర్శనం టిక్కెట్లు తీసుకొని దర్శనానికి రావాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి పరంగా ముందుకు నడవాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించాలని భక్తులకు కోరారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు.