నటుడు వివేక్‌ ఒబెరాయ్ నివాసంలో సోదాలు

 కర్ణాటక డ్రగ్స్‌కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్  నివాసంలో కర్ణాటక పోలీసులు గురువారం సోదాలు జరిపారు. కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడైన ఆదిత్య అల్వా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన పరారీలో ఉన్నారని, వివేక్‌ నివాసంలో దాక్కున్నారన్న సమాచారం మేరకు ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపినట్లు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ అన్నారు. సోదాలు నిర్వహించేందుకు వారెంటు కూడా ఉందని చెప్పారు. కర్ణాటకలో డ్రగ్స్‌ కేసు నమోదు చేసినప్పటి నుండి ఆదిత్య అల్వా పరారీలో ఉన్నారని, ఆయన శాండిల్‌వుడ్‌ పరిశ్రమలోని పలువురు నటులు, గాయకులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్స్‌ రాగిణి ద్వివేది, సంజనా గర్లాని, రేవ్‌ పార్టీ ఆర్గనైజర్‌ వీరెన్‌ ఖన్నాలతో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.