దేశ చరిత్రలో అతిపెద్ద నేరాల్లో నిర్భయ అత్యాచారం ఒకటి. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దోషులకు ఉరి అమలైంది. ఈ క్రమంలో దోషులు చివరి క్షణం వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతటి దారుణానికి ఒడిగట్టిన వీరికి ఉరి సరి అని న్యాయదేవత సైతం ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం 5.30గంటలకు జైలు నిబంధనల ప్రకారం దోషులు ముకేష్ సింగ్‌ా(32), పవన్ గుప్త(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లకు తిహార్ జైలులోని జైలు నెంబరు 3లో తలారి పవన్ జల్లాద్ ఉరిశిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. వారి ఉరి సరైందే అంటూ వేలాది మంది ప్రజలు జైలు ఆవరణకు చేరుకొని మద్దతు తెలిపారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
