నీటి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రతే ముఖ్యం : జగన్‌

రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలనచేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటినుంచి దీనిగురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ,విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌లతో కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు.