నేడు రాజ్యసభ ఎన్నికలు

రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాలకు గాను వైసిపి నుండి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్‌ అధినేత అంబాని తరఫు ప్రతినిధి పరిమళ్‌ సత్వాని నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి నుండి వర్ల రామయ్య నామినేషన్‌ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యం అయింది. వైసిపికి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, టిడిపికి 23 మంది ఉన్నారు. వీరిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి అధికార పార్టీ వైపు వెళ్లారు. టిడిపి నుంచి దూరమైన వీరంతా తమను ప్రత్యేక సభ్యులుగా పరిగణించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో టిడిపి బలం 20కి తగ్గింది. ఈ ఎన్నికలకు సంబంధించి వైసిపి సభ్యులకు గురువారం అసెంబ్లీ హాల్లో మాక్‌ పోలింగు నిర్వహించారు.