ఢిల్లీలో జరిగిన హింసపై పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు శుక్రవారం ఉదయం ధర్నా చేపట్టారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి కాంగ్రెస్ ప్రయతిస్తోంది.
ఎన్డీఏయేతర పార్టీలన్నీ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నాయి. పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగకుండా బిజెపి ప్రయత్నాలు జరుపుతోందని టీఎంసీ రాజ్యసభ నేత ఒబ్రెయిన్ ఈ రోజు విమర్శలు గుప్పించారు. పార్లమెంటు రెండో దశ సమావేశాలు ప్రారంభమై అయిదు రోజులు అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ‘ఢిల్లీ హింస’పై చర్చకు ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఈ రోజు పార్లమెంటులో తాను తప్పకుండా ఈ అంశంపై మాట్లాడి తీరుతానని చెప్పారు.