అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు.. మన పిల్లల భవిష్యత్ కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లిషు మీడియం వద్దనే పెద్ద మనుషులు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘నా పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. పిల్లలకు నవంబర్ నాటికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి. స్కూల్ బిల్డింగ్‌లు అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి ఉన్న ఎవ్వరూ పట్టించుకోలేదు. స్కూళ్లల్లో బాత్‌రూమ్‌లు కూడా సరిగా లేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వృథా అనే పరిస్థితి ఉండేది. అందుకే ఖర్చు ఎక్కువైనా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్పించేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతీది ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై.. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. మన పిల్లల భవిష్యత్ కోసం ఇది నేను పెడుతున్న పెట్టుబడి.ఏవైనా కొత్త మార్పులు చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇంగ్లిష్ మీడియానికి సంబంధించి కూడా చిన్న, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడే పరిస్థితి రావాలి. కోవిడ్ కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇస్తాం. జగనన్న విద్యాకానుకలో యూనిఫాం, బుక్స్, షూలు, బెల్ట్, బ్యాగ్ అందిస్తాం. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాం. సరుకుల బిల్లులతోపాటు ఆయాల జీతాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెనూ రూపొందించాం’ అని తెలిపారు
