ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న నిర్వహిస్తామని ఎపి డిజిపి గౌతం సవాంగ్‌ తెలిపారు. బుధవారం గౌతం సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటామన్నారు. సమాజ శ్రేయస్సు, భద్రత కోసం పోలీసులు పని చేస్తారని అన్నారు. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయని చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు పని చేస్తారని అన్నారు. గత సంవత్సరం పోలీసులకు కోవిడ్‌ కారణంగా ఒక ఛాలెంజ్‌ ఎదురయ్యిందని, పోలీసులు కోవిడ్‌ కాలంలో ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేశారని చెప్పారు. 206 మంది పోలీసులు కోవిడ్‌ కారణంగా మరణించారని ఆవేదన చెందారు. 11 మంది గత సంస్మరణ దినోత్సవం తర్వాత మరణించారని తెలిపారు. సమాజంలో పోలీసు కుటుంబాలతో సమానంగా ఎవరూ కష్టాలు భరించలేదని చెప్పారు. చాలా జాగ్రత్తలు కోవిడ్‌ కాలంలో పోలీసుల కోసం తీసుకున్నామని, ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని తెలిపారు.