పలు దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 39,400 పాజిటివ్ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్ కొనసాగుతున్నప్పటికీ.. తొమ్మిది రోజుల లాక్డౌన్ అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుండి రష్యాలో ప్రతి రోజూ 1,100 మంది కరోనాతో మరణిస్తున్నారు.
జర్మనీలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వారంరోజులుగా ప్రతి లక్షమందిలో 201 మంది వైరస్ బారిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందురోజు 37,120 కేసులు వచ్చాయని, వ్యాక్సిన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం వల్లే వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో తాజా ఉధృతిని ‘ వ్యాక్సిన్ తీసుకోనివారి మహమ్మారి’గా పిలుస్తున్నారు.