”ప్రపంచ నేతల్లారా పనికిరాని వాగ్దానాలు ఆపండి..” గర్జించిన 14 ఏళ్ల బాలిక వినీషా

” కేవలం పనికిరాని వాగ్దానాలతో సరిపుచ్చే ప్రపంచ నేతలను చూస్తుంటే మా యువతరానికి కోపం, ఆవేశం వస్తోంది”. గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌ 26 సదస్సులో భారత్‌కి చెందిన 14 ఏళ్ల  వినీషా ఉమాశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మాటలతో కాలాన్ని వెళ్లబుచ్చడం మాని పర్యావరణాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ”ఎకో ఆస్కార్స్‌”గా పిలువబడే ఎర్త్‌షాట్ ప్రైజ్‌ ఫైనలిస్ట్‌లలో ఒకరైన వినీషా ఉమా శంకర్‌ని  ప్రిన్స్‌ విలియం సదస్సులో ’క్లీన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌‘ గురించి చర్చించే సమావేశంలో మాట్లాడేందుకు ఆహ్వానించారు. ” మర్యాదపూర్వకంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక మనం మాటలు మాని చేతలు ప్రారంభించాలి. మేము ఎర్త్‌ సాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్ట్‌లం.. మీరు మా ఆవిష్కరణలు, ప్రాజెక్టులు, పరిష్కారాలకు మద్దతునివ్వాలి. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యాలపై మన దేశాల ఆర్థిక వ్యవస్థను నిర్మించవద్దు. చర్చలు ఇకపై నిలిపివేయండి ఎందుకంటే కొత్త భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేయడం అవసరం. అందుకే మీ సమయాన్ని, డబ్బును మన భవిష్యత్‌ని మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు వెచ్చించాలి ” అన్నారు. ప్రధాని మోడీ, బ్రిటన్‌ అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు హాజరైన ఈ కార్యక్రమంలో తమిళనాడుకి చెందిన ఈ 14 ఏళ్ల బాలిక ఉద్వేగభరితంగా ప్రసంగించారు.