బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర సంతకం ఫోర్జరీ!

బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర సంతకం ఫోర్జరీ!

మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అసిస్టెంట్ కొర్రి శివను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, ఈ నెల 13న హైదరాబాద్, బంజారాహిల్స్ బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ లు వసుంధర ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి, వసుంధర మొబైల్ బ్యాంకింగ్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతూ, యాక్టివేట్ చేయమంటారా? అని అడిగారు.

తామేమీ మొబైల్ బ్యాంకింగ్ ను కోరలేదని అంటూ, ఈ విషయాన్ని వసుంధర దృష్టికి తీసుకెళ్లగా, ఆమె సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో అధికారులు విచారించగా, కొత్తగా చేరిన శివ ఈ పని చేసినట్టు తేలింది. దీంతో అతన్ని నిలదీయగా, ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు అంగీకరించాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై క్రిమినల్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.