‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ త్వరలో…

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ త్వరలో పట్టాలెక్కనుంది. కరోనా నేపథ్యంలో ఈ రియాల్టీ షో పట్ల వున్న అనుమానాలు తొలగిస్తూ… స్టార్ మా ‘బిగ్‌బాస్ 4’కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ను తనదైన శైలిలో ఆకట్టుకున్న నాగార్జున .. ఈసారి ‘బిగ్‌బాస్ సీజన్ 4’ను కూడా హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఆయనపై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను షూట్ చేసారు. ఈ టీజర్‌ను ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దీనికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ సెంథిల్ చిత్రీకరించారు. త్వరలో నాగార్జునతో కూడిన ప్రోమోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున గ్రాండ్‌గా ప్రసారం చేయాలనే ఆలోచనలో స్టార్ మా నిర్వాహకులు వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు.  ఈ షో కోసం నాగార్జుకు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగా 100 రోజులు కాకుండా.. ఈసారి 70 రోజులు ఉండేలా బిగ్‌బాస్ సీజన్‌ 4ను ప్లాన్ చేసారు. కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎవరెవరు ఈ సారి హౌస్‌లోకి వెళ్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే!