భారత్‌లో కోవిడ్‌ అత్యయిక పరిస్థితులు… మోడీకి లాన్సెట్‌ హెచ్చరిక

భారత్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. కరోనా కట్టడి చేయడంలో మోడీ సర్కార్‌ తీవ్రంగా విఫలమైంది. ఇప్పటి గణాంకాలే అందుకు ఉదాహరణ. దేశంలో కరోనా అధ్వాన పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌  మండిపడింది. మే 4వ తేదీ నాటికి దేశంలో 2కోట్లకు పైగా కేసులు వెలుగుచూశాయని, అంటే రోజుకు సగటున 3,78 వేల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయని. ఆ సమయానికి 2,22,000 మందికి పైగా మరణించారని తెలిపింది. సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1 నాటికి 10 లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది. భారత్‌లో కోవిడ్‌-19 అత్యయిక పరిస్థితులున్నాయని తెలిపింది. రోగులతో ఆసుపత్రులనీ కిటకిటలాడుతున్నాయని, రోగులకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్సిజన్‌, ఆసుప్రతుల్లో బెడ్స్‌, ఇతర అవసరాల కోసం సోషల్‌ మీడియాను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగిపోవడంతో..ఎటు చూసినా కరోనా వార్తలు కమ్మేసాయని లాన్సెట్‌ పేర్కొంది.