భారత్‌లో 50 లక్షలు దాటిన కరోనా కేసులు

 దేశంలో కరోనా విళయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 90,123 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50,20,360కి చేరింది. అదే సమయంలో 1,290 మరణాలు సంభవించడంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 82,066కు చేరుకుంది. ఒక రోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారి. మరణాల సంఖ్య పెరగుతుండడం అందర్నీ కలవరపెడుతోంది. దేశంలో ఇప్పటి వరకు 39.42 లక్షల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 9,95,933 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 11,16,842 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్‌ పరీక్షల సంఖ్య 5.94 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. కరోనా బాధితుల రికవరీ రేటు 78.5 శాతం కాగా మరణాల రేటు 1.63 శాతం ఉన్నట్లు పేర్కొంది.