మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌

మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసులో విచారించేందుకు ఉదయం 7 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్న ఇడి అధికారులు గంటసేపు విచారించారు. అనంతరం ఇడి కార్యాలయానికి తీసుకెళ్లి సుమారు ఆరుగంటలసేపు ప్రశ్నించారు. ముంబయి అండర్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేసినట్లు ఇడి వర్గాలు తెలిపాయి. దావూద్‌తో సంబంధాలపై, అతని తరపున ఆస్తులు కొనుగోలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఇడి కార్యాలయం నుంచి బయటకు వస్తూ ‘మేం పోరాడతాం. గెలుస్తాం. అందరినీ బట్టబయలు చేస్తాం’ అని మాలిక్‌ నినాదాలు చేశారు. ఇడి కార్యాలయం ఎదుట ఎన్‌సిపి పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.