మాస్కు ఉంటేనే ఓటు!

జిహెచ్‌ఎంసి ఎన్నికలు డిసెంబర్‌ 1వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రిలీజ్‌ చేసింది. ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలి. ఓటర్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి. సర్కిళ్లలో ఓటర్లు ఉండేలా పర్యవేక్షించాలి. భౌతిక దూరాన్ని పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. మాస్క్‌ లేకుండా ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతించకూడదు. ప్రచారం సమయంలో రోడ్‌ షో నిర్వహిస్తే ప్రతి వాహనానికి మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి. ఒకే మార్గంలో రెండు పార్టీల రోడ్‌ షోలు ఉంటే రెండింటి మధ్య తేడా కనీసం అరగంట ఉండేలా చూడాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుంటామని అధికారులు హెచ్చరించారు.