మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్‌
మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్‌

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్‌

ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘తెల్లవారు జామున గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపింది. గ్యాస్ ప్రభావం ఐదు గ్రామాలపై ఉంది. ఘటనపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కమిటీ సూచిస్తుంది.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా… మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థికసాయం అందచేస్తాం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటాం. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం. ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాం.వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ– ఎస్టీకాలనీ, నందమూరినగర్, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలంతా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గ్రామాల్లోని దాదాపు 15వేలమంది ఉంటారని చెప్తున్నారు. వీరందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు ఇస్తున్నా. మెడికల్‌ క్యాంపులు పెట్టమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నాం. గ్రామాలకు వెళ్లలేని వ్యక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసి మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. కమిటీ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల పాటు చీఫ్‌ సెక్రటరీ, ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడే సహాయ కార్యక్రమాలకు పర్యవేక్షణ చేస్తారు. ఈ గ్రామాలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకోమని చెప్తున్నాను