మే నెల చివరి నాటికి ‘నాడు- నేడు మనబడి’ పథకం కింద పాఠశాలల్లో చేపట్టిన మొదటి దశ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనులను పూర్తి చేయడంతో పాటు, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని చెప్పారు. తొలిదశ పనులను నిర్ధేశించిన లక్ష్యంలో పూర్తిచేయడంతో పాటు, జులైలో స్కూళ్లు తెరిచే సమయానికి రెండోదశ పనులు ప్రారంభించాలని సూచించారు. స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, భవనాలపై కూడా పెయింటింగ్స్ వేయాలన్నారు. నాడు-నేడు పనులు పూర్తయ్యాక ప్రతి స్కూలులో నాడు-నేడు ఆ స్కూల్ ఎలా ఉంది?ఇప్పుడెలా ఉంది? అనే ఫోటోలను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. అలా చేసినప్పుడే ప్రస్తుతం చేసిన పనులకు మరింత విలువ వస్తుందన్నారు. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుందన్నారు. పనులను పర్యవేక్షించేందుకే పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.
