మోడీ పాలన కాలంలో రూ. 4.5 లక్షల కోట్లు పెరిగిన అంబానీ సంపద

భారత దేశంలో అత్యంత ధనవంతుడు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ. కేవలం భారత దేశంలోనే కాదు ఆరు లక్షల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలోని అత్యంత పది మంది సంపన్నుల జాబితాలో ముకేష్‌ అంబానీకి తప్ప మరే బ్రిక్స్‌ దేశాలకు చెందిన వ్యాపారవేత్తకు స్థానం దొరకలేదు. ముఖేష్‌ అంబానీ సంపద పెరిగిన తీరు ఆశ్చర్యకరంతోపాటు గొప్పదైన విషయమే. అయితే ఈ సంపద పెరుగుదల ఎలా జరిగింది? ముఖేష్‌ అంబానీ పారిశ్రామిక రంగంలో సాధించిన కొత్త కొత్త ఆవిష్కరణ కారణంగా జరిగిందా? లేక అవినీతి, ఆశ్రిత పెట్టుదారీ విధానం వల్ల జరిగిందా? గణాంకాలను చూస్తే మనకు ఇట్టే అర్దమైపోతుంది.
ప్రధానిగా మోడీ అధికారంలోకి రాకమునుపు 2014 నాటికి ముఖేష్‌ అంబానీ సంపద కేవలం లక్షా 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ ఆరేళ్లల్లో ఆ సంపద నాలుగున్నర లక్షల కోట్లకు పైగా పెరిగి మొత్తం సంపద ఆరు లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా దేశ ఆర్ధికాబివృద్ది క్షీణించి ప్రజల ఆదాయాలు పడిపోయి అందరూ ఇబ్బందులు పడుతుంటే ముఖేష్‌ అంబానీ మాత్రం గత పది నెలల కాలంలోనే లక్షా 60 వేల కోట్ల రూపాయలు రూపాయలు పోగేసుకున్నాడు. మోడీ పరిపాలనలో ముఖేష్‌ అంబానీతోపాటు అదానీ సంపద కూడా అధికంగా పెరిగింది.