రాజకీయాలకు ఇదేనా సమయం

రాజకీయాలకు ఇదేనా సమయం : మమతా బెనర్జీ

రాష్ట్రంలో కరోనా మహమ్మారి, అంఫాన్‌ తుఫాన్‌లతో విలవిలలాడుతుంటే.. ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నారంటూ బిజెపి ఆరోపించడంపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. గత మూడు నెలలుగా బిజెపి నేతలు ఎక్కడ ఉన్నారని విమర్శించారు. తాము రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇటువంటి సంక్షోభ సమయంలో.. రాజకీయాలు చేయడం తగదని దుయ్యబట్టారు. అంఫాన్‌ తుఫాను కారణంగా రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొనడంపై.. విపత్తుల పేరుతో డబ్బు రాబట్టేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. కరోనా, అంఫాన్‌ తుఫానుల నుండి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరంగా శ్రమిస్తుంటే.. కొన్ని రాజకీయ పార్టీలు మాపై కావాలని బురదజల్లుతున్నాయని అన్నారు. తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో చెల్లింపులు చేశామని, రాష్ట్రంలో నష్టపోయిన 25 మంది రైతులకు, నివాసాలు కోల్పోయిన 5 లక్షల కుటుంబాలకు సహాయం చేశామని వివరించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో రాష్ట్రాలకు సరైన వాటాలు విడుదల చేయలేదని విమర్శించారు.